News

Hinduism, Hindu is different

[ad_1]‘హిందూత్వం’ రాజకీయ ప్రయోజనాల కోణంలో హిందూమతానికి సొంత భాష్యం చెప్పింది. భారతదేశాన్ని హిందూరాజ్యం చేయాలన్న డిమాండ్‌తో పుట్టించిన వాదమది. హిందూత్వను ఎందుకు వ్యతిరేకిస్తున్నావని ఈ మధ్య నన్ను నా సన్నిహితులొకరు అడిగారు. రెండు కారణాల వల్ల అని చెప్పాను. ఒకటి వ్యక్తిగత కారణం కాగా, రెండవది రాజకీయ కారణం. ముందుగా వ్యక్తిగత కారణం వివరిస్తాను. నేను హిందువునే తప్ప హిందూత్వవాదిని కాను కనుక హిందూత్వను అంగీకరించను. హిందూమతస్థుల ఇంటిలో పుట్టినందువల్ల హిందువును అని నేను చెప్పటం లేదు. నేను హిందూమతాన్ని విశ్వసిస్తాను కనుక హిందువును. నా మతం నాకు ముఖ్యం. దీనినుంచి అనుదినం నేను కావలసిన బలాన్ని, స్థిరత్వాన్ని పొందుతాను. నా ఆలోచనలకు, జీవితానికి అది మూలం. ఇతర మతాల వారిపట్ల నేను ప్రవర్తించే తీరుకు కూడా అదే మూలం. వసుధైక కుటుంబ భావనను హిందూ సనాతనధర్మం ప్రబోధిస్తోంది.
ఏ మతానికి చెందినవారు అయినా లక్షలాదిమంది భారతీయులకు మతం ప్రధానం. దేవుడి దృష్టిలో వీరు మ్రుఖ్యులు, వీరు కారు అని లేదు. సృష్టికర్త దృష్టిలో మానవులు అందరూ సమానమే. కాబట్టి నా మతం అందుకు విరుద్ధ స్వరూపం సంతరించుకోవడాన్ని చూస్తూ భరించలేక పోతున్నాను. అది ఎన్నడూ ఊహించని రూపాన్ని తొడుక్కుంటోంది. హిందువులం అని చెప్పుకొంటూ కొంతమంది ఆచరణలో విరుద్ధమైన ధోరణిలో నడుస్త్తున్నారు. వారి వైఖరిని ప్రశ్నించే వారిపై బుల్లెట్ల్ల వర్షం కురిపిస్తున్నారు. ఢిల్లీలో ఈద్ షాపింగ్ చేసుకొని తన గ్రామానికి తిరిగి వస్తున్న 15 ఏళ్ల వేరే రాష్ట్రపు బాలుడిని రైల్లోకి కత్తులతో చొరబడిన హిందూత్వ వాదులు దారుణంగా పొడిచి చంపారు. ఆ మతవాదుల కక్ష చంపడంతో కూడా తీరడం లేదు.
మహమ్మద్ అఖ్‌లాక్, పెహ్లూఖాన్‌లను చంపడంతో శోకంలో మునిగిన ఆ కుటుంబాన్ని కూడా హిందూత్వ వాదులు వదలలేదు. హంతకులను కాకుండా బాధిత కుటుంబం వారినే ఆ అకృత్యంలో దోషులుగా చూపే ప్రయత్నం సాగిస్తున్నారు. హంతకులు మాత్రం తమ విద్వేష నేరాలను యధేచ్ఛగా కొనసాగిస్తూ స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఏసుక్రీస్తు శిలువపై చిత్రహింసల వేదనను అనుభవిస్తూ కూడా ‘తండ్రీ! వారు ఏంచేస్తున్నారో వారికి తెలియదు కనుక వారిని క్షమించు’ అని ప్రార్థించాడు. కానీ మనలోని కొందరు హిందువులు అటువంటి ప్రార్థన జరపడం లేదు సరిగదా హిందూమతం పేరిట సాటి మానవులను చంపడం, భయభ్రాంతులను చేస్తూ అందు కు గర్వపడుతున్నారు. రాజకీయ కారణం కూడా హిందూత్వ వెనుక ఉంది. రాజకీయ ప్రయోజనాల కోసమే హిందూమతానికి హిందూత్వ వాదులు కొత్త నిర్వచనం చెప్పారు. భారతదేశాన్ని హిందూరాజ్యంగా మార్చాలన్నది వారి డిమాండ్. ఈదేశం ప్రత్యేకంగా హిందువులకే చెందినదని వారి వాదన. తక్కిన భారతీయులంతా దండయాత్రలతో వచ్చారని, లేదా బయటి వారనీ వారంటారు. చరిత్రకోణంలో పరిశీలిస్తే ఈ వాదన తప్పు. ఇతర దేశాల్లో మాదిరిగా ఇప్పుడున్న భారత్ కూడా శతాబ్దాలక్రితం ఇతర ప్రాంతాలనుంచి వచ్చిన వలసల ద్వారా ఏర్పడిన సంస్కృతి గలదే. భూమిపై ‘సంకరంకాని జాతి’ అంటూ ఏదీలేదు. మనమంతా కలగలుపు ప్రక్రియలో ప్రస్తుత రూపాన్ని పొందింది. ఇక్కడి మూలవాసీలు ఎంత భారతీయులో ఆ తరువాత బయటినుంచి- దండయాత్రల ద్వారా వచ్చి స్థిరపడిన వారూ అంతే భారతీయులు. కోడి ముందా, గుడ్డు ముందా అన్న విచికిత్స లాంటిదే ముందు ఎవరు ఈ
దేశ వాసులు అన్న ప్రశ్న.
మన దేశంలో ప్రతి ఒక్క మతం, భాష, సంస్కృతి, జీవన విధానానికి చెందిన వారున్నారు. మనందరం కలిసి భారతదేశపు పౌరులం. ఈ వాస్తవాన్ని జీర్ణించుకోవడం హిందూత్వవాదులకు చాలా కష్టంగా మారింది. బయటివారుగా భావిస్తున్న వారిని సైనికచర్య ద్వారా తరిమికొట్టడం, తమ సిద్ధాంతాలకు అనుగుణంగా నడుచుకోని వారిని తుడిచిపెట్టడం అనే రెండు
మార్గాల్లో ఈ సమస్యకు హిందూత్వవాదులు చిట్కాను సూచిస్తున్నారు అని పిస్తోంది. మహాత్మాగాంధీని కాల్చి చంపడంతో వారి ఈ కార్యక్రమం మొదలైంది. ‘దేముడు ఒక్కడే, మనం ఆయనను వేరువేరు పేర్లతో పిలుస్తాము అంతే’ అని అన్నందుకే మహాత్ముని వారు కాల్చి చంపారు. అది వారి దృష్టి లో దైవదూషణతో సమానం. ‘ఈశ్వర అల్లా తేరేనామ్ సబ్ కో సన్మతి దే భగవాన్’ అనే మంత్రాన్ని ఇచ్చినందుకు కూడా మహాత్ముని వారు చంపారు. భిన్నత్వాన్ని, బహిరంగ చర్చను, అసమ్మతి ప్రకటనను ఇప్పుడు వారు ఎంతగా తెగనాడుతున్నారో మనం చూస్తున్నాం. ఈ వినాశకర ధోరణికి గాంధీ హత్య తోనే వారు బీజాలు నాటారు. చరిత్ర పుస్తకాలనుండి ‘ఇతరులను’ పూర్తిగా చెరిపివేసి తిరగరాయడం వారి కార్యక్రమం. ఆ స్థానంలో పాఠ్యపుస్తకాలలో హిందూత్వ చరిత్రను ఎక్కించడం వారి కర్తవ్యంగా ఉంది. అక్బర్ చక్రవర్తి గొప్పవాడు కాదని, హల్దీఘటీ యుద్ధం గెలిచిన రాణా ప్రతాప్‌సింగ్‌కు ఆ గౌరవం ఆపాదించాలని వారు మనకి కొత్తగా చెపుతున్నారు. హిందూత్వవాదుల పాలనలో గల కొన్ని రాష్ట్రాలలో పాఠ్యపుస్తకాలను వెయ్యేళ్ల వెనక్కి తీసుకుపోయే పాఠాలతో నింపుతున్నారు.
ముస్లింల దండయాత్రల ప్రస్తావన చెరిపివేయడానికి వారు తెగబడుతున్నారు. ఈ దండయాత్రలు, విజయాలు హిందూచరిత్రకు అంతరాయమని వారి భావన. హిందూ చరిత్రే భారతదేశపు నిజమైన చరిత్ర అని వారి వాదన. తక్కినది అంతా పొల్లు అంటారు. జనుల మెదళ్లను నియంత్రించడానికి ఈ రకం ‘జ్ఞాపకాల చెరుపుడు ప్రచారం’ వారికి అత్యవసరం.
రాజకీయాలను ‘పళ్లు ఇకిలిస్తున్న దెయ్యం’గా బెర్ట్రాండ్ రస్సెల్ ఓ సందర్భంలో అభివర్ణించారు. ప్రస్తుతం హిందూత్వ వాదుల అజమాయిషీలో రాజకీయాలు అలాగే తయారయ్యాయని అనిపిస్తోంది. మన బహుళ మత, బహుళ సాంస్కృతిక వారసత్వ సంపదను హిందూత్వవాదులు అగౌరవపరుస్తున్నారు. ఆ సంపదలో మన సాహిత్యం, వాస్తు శిల్పం, భాష, శాస్త్రం, ఆహారం, సంగీతం, నృత్యం, దుస్తులు, మర్యాదలు అన్నీ ఇమిడి వున్నాయి. వాటన్నింటిని తరిమేసి ఏక సంస్కృతిలోకి మార్చే ప్రయత్నం సాగుతోంది. అది హిందూమతానికి అనుగుణమైన ఆలోచన కాదు. గాఢ హిందూ మితవాది అయిన మహాత్మాగాంధీ ఆధునిక భారతదేశానికి స్వాతంత్రోద్యమం ద్వారా బీజాలను నాటారు. ఏ దేశపు చరిత్రలోనూ ఇంతటి మహోద్యమం జరిగి ఉండలేదు. హిందూ మితవాదులతో నిండినదే అయినా రాజ్యాంగ సభ స్వతంత్య్ర భారతదేశానికి మతపరమైన గుర్తింపును నిరాకరించి దానిని ‘మత ప్రసక్తి లేని, ప్రజాస్వామ్య రిపబ్లిక్’గా ప్రకటించింది. దేశం అనేక మతాలతో కూడినది కావడంతో మత ప్రసక్తిలేని లౌకిక వ్యవస్థను మన రాజ్యాంగ నిర్మాతలు నిర్దేశించారు. మతాన్ని ప్రైవేటు వ్యవహారంగా పేర్కొన్నారు. అటువంటి రిపబ్లిక్ నాస్తిక ప్రధానిని ఎన్నుకొంది. అయితే ఆయన తన దేశ ప్రజల మత విశ్వాసాల పట్ల గౌరవం కలవారు. ప్రతి ఒక్క భారతీయుడు తన మత విశ్వాసాల స్వేచ్ఛగా అనుసరించే అవకాశాన్ని మన రిపబ్లిక్ మనకి కల్పించింది. దేశం రెండవ సారి హిందూత్వవాదుల చేతిలోకి వెళ్లాక భారతీయులను హిందువులు, ఇతరులుగా విభజించే యత్నం జోరందుకొంది. ప్రపంచమంతా ఉగ్ర జాతీయవాదం దిశగా పయనిస్తున్నది. ఇది మరో కఠోర వాస్తవం. మనిషి గుర్తింపును మతపరంగా తప్ప చూడలేకపోవడం, తమవారు అనుకున్న వారినే చేరదీయడం, తక్కినవారిని తరిమికొట్టడం కొన్ని దేశాలలో జాతీయవాదుల ఆనవాయితీగా మారింది. సెక్యులర్ నేపథ్యంనుంచి వచ్చిన మనం ఈ ధోరణులకు అతీతులమని నిరూపించుకోవాలి. * నయనతారా సెహగల్

Comments

comments
[ad_2]

Source link